21 August, 2026 | 1:41 AM

మా సినిమాలో అదే ప్రేక్షకులకు బోనస్!

21-08-2026 12:00 AM

అల్లరి నరేశ్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్రమోహన్ విలేకరులతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. 

-సక్సెస్ కోసం ప్రతి ఒక్కరం చాలా ఆత్రుతగా ఉంటాం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఏదో ఒక సందర్భంలో దేవతలు ప్రత్యక్షమై మన కోరిక తీర్చేస్తే బాగుంటుంది కదా అనే భావన ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. అలాంటి ఒక మ్యాజిక్ లాంటి ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. ఆ తర్వాత ఈ ఐడియాకు స్క్రీన్‌ప్లే రాయడం మొదలుపెట్టా.

-ఒక వ్యక్తి అనుకున్నది జీవితంలో సాధించాలనుకుంటాడు. హీరో కావాలనేది అతని కోరిక. అందుకోసం హైదరాబాద్, చెన్నై వెళ్లి ప్రయత్నించాలి. కానీ తాను ఉన్న ఊరిలోనే ఉండి హీరో అవ్వాలనుకుంటాడు. ఏదో ఒక మ్యాజిక్ జరిగి తన కోరిక నెరవేరాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో అతని కుటుంబంలో ఉన్న ఒక పుస్తకం గురించి తెలుసుకుంటాడు. ఆ పుస్తకంపై ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని కరెక్టుగా గీస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. దానికోసం అతను దాదాపు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటాడు. చివరికి నిజంగానే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. వాళ్లు దిగకముందు ఏం జరిగింది? దిగిన తర్వాత ఏం జరిగింది? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

అల్లరి -నరేశ్‌కు ఈ కథ చాలా నచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీలయ్యారు. చాలా కమర్షియల్‌గా ఉందని చెప్పారు. నరేశ్‌తో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. -ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల ఎపిసోడ్‌ను నేను ఇప్పటివరకు ఎక్కడా రివిల్ చేయలేదు. అది ప్రేక్షకులకు బోనస్‌గా ఉంటుంది.

-నరేశ్ కామెడీ యూనివర్సల్‌గా అందరికీ నచ్చుతుంది. ఆయన అన్ని జనరేషన్స్‌కు తెలిసిన హీరో. కొంతకాలంగా ఆయన విభిన్నమైన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ తన కంఫర్ట్ జోన్‌లోకి వస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్ కామెడీ ఫుల్ ర్యాంపేజ్‌లో ఉంటుంది. -నరేశ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఆయన క్యారెక్టర్‌పై ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. 

దర్శకుడిగా -నా బలం కామెడీ. నా తొలి సినిమా ఫాంటసీ కామెడీ కావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కామెడీకి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది. అయితే, కామెడీ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. -ఈ విషయంలో నాకు త్రివిక్రమ్ స్ఫూర్తి. వల్గర్‌గా ఒక మాట చెప్పి నవ్వించొచ్చు. ప్రేక్షకులు ఆ సమయంలో నవ్వి తర్వాత మర్చిపోతారు. కానీ ఒక మంచి పదంతో, మంచి మాటతో నవ్వు పుడితే అది చాలా కాలం గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతా. -ఈ సినిమాలో కామెడీ చాలా జెన్యూన్‌గా, ప్యూర్‌గా ఉంటుంది. ఆరోగ్యకరమైన నవ్వులుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. 

ఇందులో -వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఒక సామాన్య మనిషికి, దేవతల రాజు ఇంద్రుడికి మధ్య జరిగే సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. -అలాగే సీనియర్ నరేశ్, శ్రీనివాస్‌రెడ్డి వంటి చాలా అనుభవమున్న నటులు ఇందులో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సురభి, రాశిసింగ్, ప్రిషా, విష్ణుప్రియ.. అందరూ తమ పాత్రలకు చాలా బాగా సరిపోయారు. వాళ్ల స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. 

ఈ సినిమాలో -దాదాపు 35 నిమిషాల వరకు ఇందులో సీజీ వర్క్ ఉంటుంది. నిర్మాతలు, నాకు కావాల్సిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు. రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. 

-అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీలో అందరూ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున అభిమానులు. మా నాన్న చిన్నప్పుడు నాకు ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా చూపించారు. అక్కినేని కుటుంబం అంటే మా ఫ్యామిలీకి చాలా అభిమానం. అలాంటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది.