20 May, 2026 | 5:01 PM

సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం

20-05-2026 03:45 PM

మౌలిక సమస్యల పరిష్కారంలో గత సంఘాలు వైఫల్యం

​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండిపాటు

​నాటి ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం

ఆర్జీ-1 గని సందర్శనలో టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య

గోదావరిఖని,(విజయక్రాంతి)​: సింగరేణి సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడమే ధ్యేయంగా (తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య) టీజీబీకేఎస్ పనిచేస్తుందని టీజీబీకేఎస్  వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చేశారు. బుధవారం జిడికె- 1 ఇంక్లైన్ గనిని సందర్శించిన సందర్భంగా కార్మికులు, యువ కార్మికులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న  మాట్లాడుతూ, సింగరేణిలో ప్రస్తుతం కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

​​గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి గనుల్లో కోల్‌కటర్లు వాడే కనీస పనిముట్లు, డ్రిల్ బిట్లు కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని మల్లయ్య మండిపడ్డారు. ఈ కొరత కారణంగా బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యజమాన్యం తక్షణమే స్పందించి అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

​మౌలిక సమస్యల పరిష్కారంలో గత సంఘాల వైఫల్యం

​సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా, కార్మికుల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో గతంలో గెలిచిన సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆయా సంఘాల తీరును నిరసించారు. ​మార్పిడి పేర్ల సమస్య, కారుణ్య నియామకాలు,​ సొంతింటి కల, ​కార్మికుల అలవెన్సులపై ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు ​వంటి అనేక ప్రధాన సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండిపాటు

​రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఇవ్వాల్సిన దాదాపు రూ. 51,000 కోట్ల బకాయిలను చెల్లించకుండా సంస్థను నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆరోపించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్యూయల్ అగ్రిమెంట్ ను రద్దు చేసి, ఎవరైనా ఎక్కడైనా బొగ్గు అమ్ముకునేలా విధానాలు తీసుకురావడం సింగరేణి మార్కెట్‌ను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల బొగ్గుతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర కాస్త ఎక్కువగా ఉన్నందున, ఓపెన్ మార్కెట్ విధానం వల్ల సింగరేణి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని హెచ్చరించారు.

నాటి ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం

​తెలంగాణ మలిదశ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ఏ విధంగానైతే పిడికిలి బిగించి 'జై తెలంగాణ' అంటూ ఉద్యమించారో, అదే స్ఫూర్తితో ఇప్పుడు సింగరేణిని, తమ హక్కులను దక్కించుకోవడానికి బొగ్గు బావులన్నింటినీ ఉద్యమ కేంద్రాలుగా మారుస్తామని మల్లయ్య  పిలుపునిచ్చారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కార్మికవర్గమంతా ఏకతాటిపైకి వచ్చి సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, లేనిపక్షంలో సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.