14 August, 2026 | 2:57 PM

వర్షపాతం అనిశ్చితి నేపథ్యంలో వరి సాగు వద్దు..

14-08-2026 01:44 PM

తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలే మేలు

ఇల్లందు ఏ.డి.ఏ లాల్చంద్

టేకులపల్లి, (విజయక్రాంతి): ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఈ వానాకాలంలో వరి సాగుకు దూరంగా ఉండాలని ఇల్లందు వ్యవసాయ శాఖ ఏ.డి.ఏ లాల్చంద్ సూచించారు. టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో శుక్రవారం రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటి అవసరమయ్యే పెసర, మినుము, నువ్వులు, జొన్న, కుసుమ వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.

లచ్చగూడెం గడ్డి చెరువు ఆయకట్టు పరిధిలోని సుమారు 1,000 ఎకరాల్లో, అలాగే బోడు, కొప్పురాయి గ్రామాల్లో పారికలవాగు కింద ఉన్న సుమారు 250 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని తెలిపారు. నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకొని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఎదురయ్యే నీటి కొరతను అధిగమించడంతో పాటు రైతులు నష్టపోకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మా చైర్మన్ మంగీలాల్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఏవో అన్నపూర్ణ, ఏఈఓ రెహానా, రైతులు పాల్గొన్నారు.