వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలి
కేటీపీపీ టీజీపీఈజేఏసీ డిమాండ్
24వ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన
గణపురం,జులై 20 (విజయ క్రాంతి): వైటీపీఎస్‌లోని సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ విభాగాల నిర్వహణను మూడు సంవత్సరాల కాలానికి రూ.255 కోట్ల వ్యయంతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీ టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం 24వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డు స్లోగన్లతో నిరసన కొనసాగింది.
కేటీపీపీ ప్రధాన గేటు ఎదురుగా సెంట్రల్ జాక్ ఆదేశాలతో జెన్ కో లోని డ్యూటీ పనులకు అంతరాయం జరుగకుండా ఆఫీస్ డ్యూటీ టైమ్ లోపే 9గంటల నుండి 9:25 లోపే ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని జే ఏ సి ఆదేశాలను పాటించాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు, వివిధ యూనియన్‌లు, నాయకులు, సభ్యులు, పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా టీజీపీఈజేఏసీ నాయకులు మాట్లాడుతూ, వైటీపీఎస్‌ను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మూడు సంవత్సరాల కాలానికి రూ.255 కోట్లతో పిలిచిన టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలు, సంస్థ భవిష్యత్తు ప్రజా రంగ పరిరక్షణ కోసం ఈ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ ఉత్పత్తి సంస్థ యాజమాన్యం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను గౌరవించి టెండర్‌ను రద్దు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు.






