29 August, 2026 | 11:04 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాషా దినోత్సవ వేడుకలు

29-08-2026 06:58 PM

కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సి. హెచ్. మైసయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు చంద్రప్రకాష్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి సేవలను స్మరించుకుంటూ, తెలుగు భాష ప్రాధాన్యం, మాతృభాష పరిరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ, తెలుగు భాష గొప్ప సాహిత్య సంపదను కలిగి ఉందని, విద్యార్థులు మాతృభాషపై గౌరవం, అభిమానం పెంపొందించుకోవాలని సూచించారు.

తెలుగు విభాగాధిపతి సోమ ప్రవీణ్ మాట్లాడుతూ, తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, ఆధునిక కాలంలోనూ తెలుగును సజీవంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సి. హెచ్. మైసయ్య మాట్లాడుతూ, విద్యార్థులు తమ దైనందిన జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు కవితలు, వ్యాసాలు, ప్రసంగాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు భాషా వైభవాన్ని చాటారు. కార్యక్రమంలో అధ్యాపకులు గడిదెల రాజు, డా. జి. రమేష్ బాబు, ఎస్. రవి, బి. మంజుల, షేక్ సలీం, జి. ప్రసాద్, డాక్టర్ డి. శంకర్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.