29 August, 2026 | 11:35 PM

నిరుపయోగంగా డంపింగ్ యార్డ్

29-08-2026 10:57 PM

పల్లె ప్రకృతి వనం పక్కన చెత్త కుప్పలు

తడి, పొడి చెత్తను యార్డ్‌లోనే వినియోగించాలని గ్రామస్తుల డిమాండ్

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా ఉండగా, గ్రామంలో సేకరిస్తున్న తడి, పొడి చెత్తను పల్లె ప్రకృతి వనం పక్కన ఉన్న గుట్ట ప్రాంతంలో వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో సేకరించే చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించి, తడి చెత్తతో ఎరువు తయారు చేయడంతో పాటు పొడి చెత్తను వేరు చేసి నిర్వహించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా గుట్ట ప్రాంతంలో చెత్తను పోస్తున్నారని ఆరోపించారు.

దీంతో ఆ ప్రాంతంలోని వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.గ్రామంలో ఇప్పటికే డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకురాకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి అజాగ్రత్త కారణంగానే డంపింగ్ యార్డ్ వినియోగం లేకుండా పోయిందని ఆరోపించారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, గ్రామంలో సేకరించే తడి, పొడి చెత్తను అక్కడే వేరు చేసి తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని గ్రామస్తులు కోరారు.