2 June, 2026 | 11:23 AM

జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2026 10:37 AM

జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నితికా పంత్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు.

వారి పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ సేవా పథకాలు అందజేశారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.