8 April, 2026 | 12:18 AM

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభను విజయవంతం చేయండి

07-04-2026 10:06 PM

–పిట్టల అర్జున్

దమ్మపేట,(విజయక్రాంతి): రైతంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈనెల 23 నుండి కొత్తగూడెంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ కోరారు. రైతు సంఘం మహాసభలు విజయవంతం కొరకు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నెమలిపేట,  అర్బన్ కాలనీలలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ మహాసభల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ కోట్లాదిమందికి అన్నం పెట్టే రైతన్న నేడు అనేక కష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతాంగ ఆత్మహత్యలకు కారణం పాలకులు అవలంబిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ట్రంపు డిమాండ్లకు తలవొగ్గి వ్యవసాయ ఎగుమతి దిగుమతి సుంకాలను ట్రంపుకు అనుకూలంగా మార్చడం వలన వ్యవసాయ రంగం పెను ప్రమాదానికి గురైందన్నారు.

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలు, రైతు భరోసా నిధులు కానీ,రుణమాఫీ కానీ, వడ్లకు సబ్సిడీ గానీ పూర్తిస్థాయిలో ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అమలు చేయలేదన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు అఖిలభారత నాయకులు అశోకుతావులే, విజ్జు కృష్ణన్ హాజరుకానున్నారని, మహాసభల మొదటి రోజు వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, రామకృష్ణ, ఈశ్వరమ్మ, సత్యవతి, విజయలక్ష్మి, యశోద, బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.