26 July, 2026 | 2:12 AM

కఠిన చట్టం తీసుకొస్తున్న ప్రధాని

26-07-2026 12:00 AM

పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ.15 కోట్లు జరిమానా

యూపీఏ చట్టాన్ని ఎందుకు తేలేదు

యువత భవిష్యత్తే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

ప్రధాని మోదీకి తెలంగాణ బీజేపీ కృతజ్ఞతలు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం - చట్టానికి సవరణ చేయబోతోందని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ప్రశ్నపత్రాలు లీకైతే బాధ్యులకు పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.15 కోట్లు జరిమానా విధించబోతున్నట్లు పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారన్నారు.

కఠిన చట్టాలను మోదీ తీసుకొస్తున్నారన్నారు. యువత భవిష్యత్తును కాపాడడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పేపర్లు లీక్ అయినా ఇలాంటి చట్టాలు తీసుకురాలేదన్నారు. రాధాకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఎన్టీఏలో పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. నిర్లక్ష్యంపై 47 మంది అధికారులను బదిలీ చేసిందన్నారు. 

ఈ చట్టం పరిధిలో ఆ సంస్థలు

ఈ చట్టం పరిధిలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలతోపాటు కేంద్రం నిర్వహించే అన్ని ప్రజా పరీక్షలు ఉంటాయన్నా రు. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి మోదీకి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కార్యాలయంలో సంత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకల్లో రాంచందర్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.