27 February, 2026 | 1:44 AM

అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తెలంగాణ

27-02-2026 12:00 AM
  1. 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం
  2. ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు 
  3. ‘ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): తెలంగాణను దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణా ళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఆ దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇంటిగ్రేషన్, పాలసీ అండ్ రెగ్యూలేటరీ ఫెసి లిటేషన్, సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ లాజిస్టిక్స్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్‌తో కూడిన ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.

ముంబైలోని జియో వరల్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘మెస్సే ముంచెన్ ఇం డియా (మెస్సే ముంచెన్ జర్మనీ అనుబంధ సం స్థ)’ నిర్వహిస్తోన్న ‘ట్రాన్స్‌పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో గురువారం శ్రీధర్‌బాబు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలకరంగాల్లో ప్రధానమైన ‘లాజిస్టిక్ రంగం’లో 2047 నాటికి తెలంగాణను తిరుగులేని శక్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.

భౌగోళిక విస్తీర్ణంలో పదకొండు, జనాభాలో పన్నెండో స్థా నంలో ఉన్న తెలంగాణ వాటా దేశ జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉందని వివరించారు. దీనిని 2047 నాటికి 10 శాతానికి పెంచాలనే సంకల్పంతోనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు. 3 ట్రిలియన్ డాలర్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చేర్చాలనే లక్ష్య సాధనలో లాజిస్టిక్ రంగానిదే కీలక పాత్ర అని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల పునర్నిర్మాణం, ఏఐ ఆధారిత ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్, సస్టైనబిలిటీ అనే మూడు ప్రధాన మార్పులు లాజిస్టిక్స్ రంగాన్ని సమూలంగా మా ర్చేస్తున్నాయన తెలిపారు.

ఇలాంటి తరుణంలో భౌగోళికంగా మనకున్న అనుకూలతలను ‘డిజైన్ అడ్వాంటేజ్’గా మార్చుకుని సత్తా చాటేలా ముం దుకెళ్తున్నామని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్ 2, కొత్త ఎయిర్ పోర్టులు, డ్రైపోర్టు, తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ 2.0, లాజిస్టిక్ హబ్స్ తదితర ప్రాజెక్టులు ఈ రంగంలో రాష్ట్రాన్ని అంతర్జాతీయస్థాయి కేంద్రంగా మార్చుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన రెడీ టూ వర్క్ ఫోర్స్‌ను తయారు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. కేవలం వస్తువులను ఉత్పత్తి చేయడమే కాకుండా, వాటిని ప్రపంచం ఊహించని వేగంతో డెలివరీ చేసి ‘లాజిస్టిక్ పవర్ హౌస్’గా ఎదిగే సత్తా తెలంగాణకు ఉందని స్పష్టంచేశారు.

మల్టీ మోడల్, రైల్ లింక్డ్ అసెట్స్, ఎయిర్ కార్గో, కోల్ చైన్, గ్రేడ్ ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర క్యాటగిరీల్లో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు శ్రీధర్‌బాబు పిలుపుని చ్చారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శకమైన పాలసీలు, ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.