1 August, 2026 | 1:07 AM

గోదావరి ఉద్ధృతి.. చింతిర్యాల అశ్వాపురం రహదారిపై వరద ముప్పు

01-08-2026 12:13 AM

కుమ్మరిగూడెంలో అప్రమత్తమైన వైద్యశాఖ.. గర్భిణులు, విద్యార్థుల తరలింపు

అశ్వాపురం, జూలై 31 (విజయక్రాంతి):  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. చింతిర్యాల గ్రామం నుంచి అశ్వాపురం ప్రధాన రహదారికి సమీపంలో వరద నీరు వేగంగా చేరుతుండటంతో శుక్రవారం రాత్రికల్లా రహదారి పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఆ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.

మరోవైపు వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని కుమ్మరిగూడెం గ్రామంలో అశ్వాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర వైద్య సేవల కోసం 102 అంబులెన్స్ను సిద్ధంగా ఉంచడంతో పాటు, గ్రామంలో గర్భిణులు, విద్యార్థులు, వృద్ధులను ట్రాక్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.