calender_icon.png 4 February, 2026 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ ఉల్లంఘనలను సహించం

04-02-2026 12:00:00 AM

పౌరుల గోప్యత హక్కును హరిస్తే ఊరుకోం

నిబంధనలు పాటించకపోతే భారత్ విడిచి వెళ్లిపోండి 

వాట్సాప్, మెటాకు సంస్థకు సుప్రీం కోర్టు హెచ్చరికలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: భారత్‌కు వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో రాజ్యాంగ నిబంధనలను పాటించలేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా, వాట్సాప్ సంస్థలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కులతో ఆడుకోవడాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. వాట్సాప్ సంస్థ కొత్తగా అమలు చేస్తున్న గోప్యతా విధానంపై దాఖలైన అనేక పిటిషన్లపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాట్సాప్ నిబంధనలు సామాన్యులకు అర్థం కాని విధంగా, సంక్లిష్టంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటప్పుడు మారుమూల గ్రామాలకు చెందిన పేదలు, నిరక్షరాస్యులు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించింది.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారం వ్యాపార ప్రయోజనాల కోసం వాడటం ఆధునిక దోపిడీ అని అభివర్ణించింది. డేటా షేరింగ్‌ను అంగీకరించకపోతే యాప్ వాడటం మానేయాలనడం సరికాదని పేర్కొంది. ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను బలిపశువులను చేస్తే చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పింది. నిబంధనల ఉల్లంఘనపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.213 కోట్ల జరిమానాను సైతం సమర్థించింది. ఆ మొత్తాన్ని మెటా సంస్థ ఇప్పటికే డిపాజిట్ చేసినట్లు కోర్టుకు సమాధానమిచ్చింది. కేసు తదుపరి విచారణ కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖను కూడా ఒక పక్షంగా చేర్చింది.