13 May, 2026 | 2:04 AM

సమస్యల వలయంలో సండే మార్కెట్!

03-09-2025 12:00 AM
  1. రామచంద్రాపురంలో పేరుకుపోయిన చెత్తాచెదారం
  2. పట్టించుకోని అధికారులు

రామచంద్రపురం, సెప్టెంబర్ 2 : పట్టణాల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులకు పట్టడం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగించక పోవడంతో దుర్వాసన వెదజల్లి ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించేలా మారుతోంది. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్ చెత్తాచెదారంతో నిండిపోగా, మార్కెట్ వాతావరణం అసహ్యంగా మారింది. ఇటీవల పటాన్చెరుకు వెళ్లే రహదారిపై సీసీ రోడ్డు పనులు చేపట్టగా,

ఆ మరమ్మతుల వ్యర్థాలను మార్కెట్ ప్రాంగణంలోనే పడేశారు. దీంతో మార్కెట్ నిర్వహించుకునే వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త, రోడ్డు వేస్టేజ్ వర్షపు నీరు కారణంగా దుర్వాసన వ్యాపించి మార్కెట్ ప్రాంగణం దుర్భర స్థితికి చేరుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా ఈ సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మార్కెట్లో వేసిన చెత్తను తొలగించాలని డిమాండ్‌చేస్తున్నారు. 

జాడలేని సిబ్బంది, అధికారులు...

రామచంద్రాపురం సండే మార్కెట్లో అధికారులే రోడ్డు మరమ్మతు వ్యర్థాలను పారబోయడం గమనార్హం. వాటిని వెంటనే తొలగించాల్సి ఉండగా అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వర్షాల కారణంగా వర్షం నీరునిలిచిపోవడం, చెత్తాచెదారం పోగవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుంది.

దీంతో మార్కెట్లో వ్యాపారం చేసుకునే వారితో పాటు మార్కెట్కు వచ్చే కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షం నీరు నిలిచిపోయి బురదగా మారి ఈగలు, దోమలతో వ్యాపారులు స్త్వ్రర విహారం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.