ఇద్దరి ఆత్మహత్య..
కుటుంబాల్లో విషాదం
మొయినాబాద్, మే 19 (విజయక్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలో రెండు వేర్వేరు చోట్ల వ్యక్తులు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి ఘటన అమ్దపూర్ శివారులో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్కు చెందిన సమీర్ మాజీ (32) భార్య రాఖీ మాజీ కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు నిమిత్తం మొయినాబాద్ మండలానికి వలస వచ్చారు. అమ్దపూర్ శివారులోని ఓ ఫామ్ హౌస్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఫామ్ హౌస్ గేటుకు తాళం వేసి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన సమీర్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన భార్య చుట్టుపక్కల వెతకగా.. ఫామ్ హౌస్ వెనుకనున్న వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించింది. మృతుడి భార్య రాఖీ మాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో ఘటన సురంగల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన వేమనూరి మల్లికార్జున రెడ్డి (24) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సురంగల్ గ్రామ శివారులోని కాశ్మీర్ ఫామ్ హౌస్ సమీపంలో చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున రెడ్డి మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తల్లి వేమనూరి సునంద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






