20 May, 2026 | 6:06 AM

మాడ్గుల మండల కేంద్రంలో డీసీపీ ఆకస్మిక తనిఖీలు

20-05-2026 12:00 AM

మాడ్గుల, మే19, (విజయ క్రాంతి):  మాడుగుల మండల కేంద్రంలో మహేశ్వరం జోన్ డిసిపి నారాయణరెడ్డి మంగళవారం మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. ఇబ్రహీంపట్నం కేవిపి రాజుతో కలిసి ముందుగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం త్రాగునీరు, నీడ, కూర్చునే ఏర్పాట్లు, టోకెన్ విధానం, పారిశుద్ధ్యం సక్రమంగా తూకం వేయాలని అధికారులను డీసీపీ ఆదేశించారు. క్యూ లైన్లు కనబడడం చేయాలని, మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరపాలని సూచించారు. రైతుల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు రాకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

అనంతరం మాడ్గుల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి ఆయా స్టేషన్ రికార్డులు, పెండింగ్ పిటిషన్లు, క్రైమ్ రికార్డులు, రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, బీట్ బుక్స్, సీసీటీవీ పనితీరును పరిశీలించారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని రాత్రి గస్తీ వాహన తనిఖీలు బీట్ పోలీసింగ్ పటిష్టం చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు అనుమానితులపై నిఘా పెంచి నేరాలు అరికట్టాలని ఆదేశించారు. గ్రామ పెద్దలతో సమన్వయంతో కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేయాలని తెలిపారు. మాడ్గుల పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో సిఐ వేణుగోపాల్,ఎస్త్స్రలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.