ఇందన్ పల్లి ఎఫ్ఆర్ఓను ఉద్యోగం నుంచి తొలగించాలి
తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం(Jannaram Mandal) ఇందన్ పల్లి అమాయక ఆదివాసి నాయక్ పోడు తెగకు సంబంధించిన ఐదుగురు యువకులపై దౌర్జన్యంగా దాడి చేసి, విచక్షణ రహితంగా కొట్టి హింసించి నిర్బంధించిన ఇందన్ పల్లి ఎఫ్ ఆర్ ఓ లక్ష్మీనారాయణను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ సోమవారం డిమాండ్ చేశారు. అమాయక ఆదివాసి నాయక్ పోడు తెగకు చెందిన ఐదుగురు యువకులను పట్టుకొని వేటకు వచ్చారనే నేపంతో అదివారం విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసి వివిధ ప్రాంతాలలో తిప్పి నిర్బంధించిన లక్ష్మి నారాయణను తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు.
లేనియెడల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలతో కలిసి ఇంధన్ పల్లి(Indhanpalle) ఎఫ్ ఆర్ వో కార్యాలయం ముట్టడిస్తామని, దీనికి జరగబోయే పరిణామాలకు ఫారెస్ట్ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అదేవిధంగా ఈ దాడిలో పాల్గొన్న ఫారెస్ట్ సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి అర్కా శేషరావు, సంయుక్త కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, అదిలాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆత్రం గణపతి తదితరులు పాల్గొన్నారు.






