రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జారే
దమ్మపేట, ఆగస్టు 03(విజయ క్రాంతి): రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నూతన విధానాల ద్వారా ప్రతి నెల 1వ తేదీనే జీతాల చెల్లింపు, రూ. 1.5 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజీ కల్పించడం గర్వకారణమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం 'ప్రజాపాలన' కార్యక్రమంలో భాగంగా గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీఎం రేవంత్ రెడ్డిలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించిన చారిత్రాత్మక ప్రయోజనాలపై కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు.






