27 May, 2026 | 3:24 AM

ఎడ్ల బండిపై కార్యాలయానికి సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి

27-05-2026 12:00 AM

కరీంనగర్, మే 26 (విజయ క్రాంతి): రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎడ్ల బండిపై ఇంటి నుండి సుడా కార్యాలయానికి వెళ్లారు. ఎడ్ల బండి నడుపుకుంటూ వెళ్తూ మార్గ మధ్యలో ఆగుకుంటూ ప్రజలతో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. సుడా కార్యాలయానికి చేరుకున్న అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్లో పాయిజన్ ఇచ్చినట్టు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడు జీవితం పై తీవ్ర భారం మోపుతున్నారని దీని వల్ల అన్నిటిపై ప్రభావం పడి ధరలు పెరుగుతాయని అన్నారు.

గతంలో యుపిఎ ప్రభుత్వం హాయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఆరోజు అరవై రూపాయలకు అందిందించిందని వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని లేకపోతే వాహనాలలో తిరిగే పరిస్థితి లేదని అందుకే నేను ఎడ్ల బండి పై ఆఫీసుకు వచ్చానని చెప్పారు.

మోడీ సర్కార్ కు మాటల గారడి చేసి ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతే ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ధరలు దించే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లిఖార్జున రాజేందర్, పర్వతం మల్లేశం,జగన్ రెడ్డి,గుండటి శ్రీనివాస్ రెడ్డి,పిట్టల రవీందర్,సుదర్శన్, శ్రీధర్ రెడ్డి,పటేల్ శ్రీనివాస్ రెడ్డి,కాంపెల్లి కీర్తి కుమార్,గడమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్నారు.