వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి
పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన భోజనంతో పాటు పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ
దుమ్ముగూడెం/భద్రాచలం టౌన్,(విజయక్రాంతి): గోదావరి వరద తాకిడికి గురి అయిన ముంపు గ్రామాల కుటుంబాల ప్రజలకు పునరావాస కేంద్రాలలో నాణ్యమైన ఆహారంతో పాటు వారి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు. శనివారం దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామంలో ముంపుకు గురైన డబుల్ బెడ్ రూమ్ కాలనీ, ప్రగళ్ల పల్లెలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ఆరోగ్య క్యాంపులు నిర్వహిస్తూ ఆరోగ్య పరిరక్షణ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
వరద పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితి ఏర్పడే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు భరోసా కల్పించారు. అనంతరం పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వరద బాధితులతో ఆయన మాట్లాడుతూ వరదలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చేవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి. ఆరోగ్యపరంగా భోజనం విషయంలో శానిటేషన్ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తీసుకొని రావాలన్నారు. వరదల సమయంలో పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
పునరావాస కేంద్రంలో ఉండే ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసి వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్సీకి తరలించి డెలివరీ అయ్యే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తాసిల్దార్ అశోక్ కుమార్ ఎంపీడీవో వివేక్ రామ్ ఎంపీఓ వీరారెడ్డి ఆర్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






