12 August, 2026 | 11:08 AM

కష్టపడి చదివి కలలను నిజం చేసుకోండి

12-08-2026 01:24 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

ఆత్మకూరు (ఎస్), ఆగస్టు 11: విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.మంగళవారం ఆయన ఆత్మకూరు (ఎస్) కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదులు, వసతి గదులు, వంటగదిని పరిశీలించి విద్యార్థుల మెనూ, భోజన నాణ్యతపై ఆరా తీశారు. భోజనం నాణ్యంగా ఉందని అభినందిస్తూ, ఇదే వంట నాణ్యతను నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.తరగతి గదిలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్.. వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అవుతామని విద్యార్థులు చెప్పిన సమాధానాలను,

వారి ఆత్మవిశ్వాసాన్ని ఆయన అభినందించారు.‘సొంత కాళ్లపై నిలబడాలంటే చదువే ఏకైక మార్గం.. కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల కలలను నిజం చేయండి‘ అని హితబోధ చేశారు.పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విశాల్, తహసిల్దార్ అమిన్ సింగ్, ప్రిన్సిపాల్ వై. సరస్వతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.