calender_icon.png 18 February, 2026 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకనైన రౌడీయిజం మానుకో

18-02-2026 01:23:55 AM

  1. బాల్క సుమన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు

ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారు 

మంత్రి వివేక్ వెంకటస్వామి 

చెన్నూర్, ఫిబ్రవరి 17: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి ఎన్నికలలో ఓడి పోతున్నారనే ఫ్రస్ట్రేషన్‌లో అధికార పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నాడని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంగళవారం చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, డీసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.

చెన్నూర్ నియోజకవర్గంలోనీ క్యాతనపల్లి మున్సిపాలిటీలో బాల్క సుమన్ రౌడీయిజం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడన్నారు. మాపైన కావాలనే బాల్క సుమన్ దాడులు చేశాడని, అవి వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ హయంలోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నేను, ఎంపీ వంశీ మెంబెర్స్‌గా ఉన్నామనీ, ఎన్నికలలో పాల్గొనేందుకు వెళ్లినపుడు బాల్క సుమన్ మా కారు పైన అక్కడ పెట్టిన ట్రాఫిక్ వస్తువుతో దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడుల్లో ఒక కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలయ్యాయనీ, బాల్క సుమన్‌పైన పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో బాల్క సుమన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడనీ, ఈ ఎన్నికలు ఎవరిపైన ఒత్తిడి లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయన్నారు. 144 సెక్షన్ ఉన్నప్పుడు కావాలనే గుం పులుగా ఉండి దాడులు చేయడమే కాకుండా ప్రెస్‌మీట్ పెట్టీ మేమే వారి పైన దాడులు చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

మున్సిపాలిటీలో మా కౌన్సిలర్‌పైన బీఆర్‌ఎస్ నాయకులు దాడులు చేస్తేనే మేము బయటకు రావడం జరిగిందన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాక ఏ ఒక్క బీఆర్‌ఎస్ కార్యకర్తపైన కేసులు పెట్టలేదనీ, ఓడిపోయిన బాధలో ఇలాంటి దాడుల కు పాల్పడుతున్నారనీ దుయ్యబట్టారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

వివేక్, వంశీకృష్ణవి దిగజారుడు రాజకీయాలు: సుమన్ 

రామకృష్ణాపూర్: కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటు అని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

22 వార్డు సభ్యులలో 14 సభ్యులు ఒకవైపు ఉండగా దౌర్జన్యంగా కౌన్సిలర్లను లాక్కొని వెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేశారని, దీనిని క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు గమనిస్తున్నారని, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన కోరం ఉన్నప్పటికీ అధికారులు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని కార్యకర్తలుగా పనిచేస్తూ ఎన్నికలను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గెలుపు ఓటములను ఎవరైనా అంగీకరించాల్సిందేనని, ఓటమిని జీర్ణించుకోలేక ఇలా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ 18న (నేడు) బిఆర్‌ఎస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్, సిపిఐ నాయకులు రాజా రమేష్, సంపత్ పాల్గొన్నారు.