పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కల్వకుర్తి, జూలై 2: కల్వకుర్తి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందినీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ, వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్-112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్‌పై వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో సహాయం అందించాలని బ్లూ కోల్ట్ సిబ్బందికి ఆదేశించారు. రౌడీషీటర్ల వివరాలను సమీక్షించి, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
గ్రామ స్థాయిలో పనిచేసే విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, సైబర్ క్రైమ్ వారియర్, సీసీటీవీ ఇన్‌చార్జ్‌తో పాటు ఇతర సిబ్బంది పనితీరును సమీక్షించి విధి నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్న ఎస్పీ, ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకుండా వేగంగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సై కురుమూర్తిని ఆదేశించారు. ఎస్పి వెంట డిఎస్పి వెంకట్ రెడ్డి ఉన్నారు.






