జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలకు, చిన్నారులకు, రోగులకు అవసరమైన చికిత్స, మందులు, పరీక్షలు సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు.ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోగులను అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, వైద్య విద్యా బోధన, మెరుగైన వసతుల కల్పనపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.






