రూ.10లక్షల కోట్లు ఆవిరి!
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపిన మధ్య ప్రాచ్యంలోని ఉద్రిక్తతలు
ముంబై, మార్చి 30: భారత్ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ.10లక్షల కోట్లు ఆవిరైపోయాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి.
చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాలు.. తట్టుకోలేక షేర్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి.సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు నష్టపోయి 71,947.55 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ 488.20 పాయింట్లు పతనమై 22,331.40 వద్ద ముగిసింది.మార్కెట్ కుప్పకూలడంతో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.౪౧౨ లక్షల కోట్లకు పడిపోయింది. ఒక్కరోజులోనే భారీ సంపద కరిగిపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం స్టాక్ మార్కెట్లను కోలుకోలేనంతగా దెబ్బతీసింది.
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు దిగుతాయన్న వార్తలు వస్తుండడం.. ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు చేయడం పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెంచింది.కాగా టెక్నికల్‌గా చూస్తే, నిఫ్టీ కీలకమైన 22,500 మద్దతు స్థాయిని కోల్పోవడం మార్కెట్లో మరింత బలహీనతకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. 22,500-22,600 స్థాయి నిఫ్టీకి తక్షణ నిరోధకంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నిఫ్టీలో టాప్ లూజర్లుగా నిలిచాయి.
సెన్సెక్స్ ప్యాక్లో టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మాత్రమే లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి.లార్జ్క్యాప్ షేర్లతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.68 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 2.66 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి.




