8 August, 2026 | 7:11 PM

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం

08-08-2026 05:52 PM

గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేయాలి

మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి మండల గ్రామశాఖ అధ్యక్షులకు శ్రీపాదరావు చిత్రపటాల పంపిణీ

రామగిరి,(విజయ క్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. ఆయన సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటాన్ని సగౌరవంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

రామగిరి మండలం రత్నాపూర్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ స్వయంగా శ్రీపాదరావు చిత్రపటాలను గ్రామశాఖ అధ్యక్షులకు అందజేశారు.

ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన వారసత్వాన్ని, ప్రజా సేవా స్ఫూర్తిని ప్రతి గ్రామంలో స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామశాఖ అధ్యక్షులు తమకు అందిన చిత్రపటాలను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తీసుకెళ్లి సర్పంచ్‌లకు అందజేయాలని తిరుపతి యాదవ్ సూచించారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటాన్ని సగౌరవంగా ఏర్పాటు చేసి, ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలను ప్రజలు నిరంతరం స్మరించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రామగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించే బాధ్యతను గ్రామశాఖ అధ్యక్షులు తీసుకోవాలని తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ శ్రీపాదరావు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. దివంగత శ్రీపాదరావు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు తండ్రి అని నాయకులు పేర్కొన్నారు.