8 August, 2026 | 8:51 PM

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు.. బొలెరో పట్టివేత

08-08-2026 06:06 PM

* 32 బ్యాగుల్లో బియ్యం స్వాధీనం.. డ్రైవర్‌పై కేసు నమోదు

* గతంలోనూ ఇదే వాహనంపై కేసు నమోదైనట్లు డీటీ వెల్లడి

అచ్చంపేట,(విజయక్రాంతి): రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మహేంద్ర బొలెరో వాహనాన్ని అచ్చంపేట పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట ఎస్సై బి. నరేష్‌ తెలిపారు.

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో అచ్చంపేట శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా (టీఎస్‌ 31 టీఏ 2726) మహేంద్ర బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* 32 బ్యాగుల్లో బియ్యం

శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ హేమ్లా నాయక్‌ సమక్షంలో వాహనానికి పంచనామా నిర్వహించారు. బొలెరో వాహనంలో మొత్తం 32 బ్యాగుల్లో రేషన్‌ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యం పరిమాణాన్ని అధికారులు నిర్ధారించి తదుపరి చర్యలు చేపడుతున్నారు.

* ఇదే వాహనంపై గతంలోనూ కేసు

ఇదే బొలెరో వాహనం గతంలోనూ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ హేమ్లా నాయక్‌ తెలిపారు. సుమారు ఏడాది క్రితం ఈ వాహనంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దీంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో వాహన వినియోగంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

* అక్రమ దందాపై ఉక్కుపాదం

అచ్చంపేట పట్టణ పరిధిలో రేషన్‌ బియ్యం అక్రమ కొనుగోలు, తరలింపుపై తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, నిర్వాహకులపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి అసలు సూత్రధారులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు వాహనాలు, వ్యక్తులు మారుస్తూ అక్రమ దందా కొనసాగుతోందన్న ఆరోపణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతోపాటు పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం వాహనాలు, డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో సరిపెట్టకుండా, అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.