30 May, 2026 | 4:30 PM

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీలు

30-05-2026 03:24 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జూన్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంయుక్తంగా పరిశీలించారు. కెరమెరి మండలం కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో పర్యటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీలు, ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను పరిశీలించి భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల అందుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అనంతరం రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు ఏర్పాటు చేస్తున్న ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను డ్రోన్ సాయంతో పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి పర్యటన, సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్పీలు సూచించారు. ఈ పరిశీలనలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.