పాల్వంచలో వరుస దొంగతనాలు
లబోదిబోమంటున్న పట్టణవాసులు..
ఐదు తులాల బంగారం, రూ.30 వేల నగదు అపహరణ..
పోలీస్ వ్యవస్థపై సన్నగిల్లుతున్న నమ్మకం.
పాల్వంచ, (విజయక్రాంతి): పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో గత కొంతకాలంగా జరుగుతున్న వరుస దొంగతనాలతో పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు. దొంగతనాల నియంత్రణ లో పోలీస్ శాఖ తీరును ప్రజలు సంశయిస్తున్నారు. పాల్వంచ పట్టణంలో ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగిన ఘటన ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళన రేపింది. పట్టణంలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.30 వేల నగదును అపహరించినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పట్టణంలోని మార్కెట్ పరిధిలో నాలుగు ఏసీ మిషన్ లు చోరీకి గురైన సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది . వాణిజ్య సముదాయం లేదా సంబంధిత ప్రాంగణంలో అమర్చిన ఏసీ యూనిట్లను రామవరం కు చెందిన నలుగురు మహిళల దొంగలు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. వారు దొంగతనం చేసిన ఏసీ యూనిట్లను ధ్వంసం చేసి పట్టణంలోని పాత ఇనుప దుకాణాలలో విక్రయించినట్లు తెలుస్తోంది.
వాటి విలువ సుమారు రూ 2 లక్షలు ఉంటుందని అంచనా. ఇటీవల పాత పాల్వంచలోని గడియ కట్టలు వెనక గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని ఇంట్లో ఉండగా, ముందు గదిలో తాళం పగులగొట్టి బంగారాన్ని అపహరించిన సంఘటన విధితమే. పట్టణంలో తరచు చోరీలు జరగడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. వరుస చోరీల నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో దొంగతనాల విషయమై పట్టణ ఎస్సై నాగరాజును వివరణ కోరగా ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి, సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. పట్టణంలో ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్సై తెలిపారు






