13 August, 2026 | 9:42 AM

గామాలపాటి లక్ష్మయ్య జ్ఞాపకార్థంగా క్రీడా పోటీలు

13-08-2026 08:41 AM

గుండాల, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 సంవత్సరంలో గామాలపాటి లక్ష్మయ్య అటెండర్ గా విధులలో చేరి  2015 సంవత్సరంలో పదవి విరమణ పొందారు. ఆయన అనారోగ్యంతో 2024 లో మరణించారు. గామాలపాటి లక్ష్మయ్య జ్ఞాపకార్థంగా ఆగస్టు 15 పురస్కరించుకొని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులకు క్రీడ పోటీలను కుటుంబ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  గుండాల  సర్పంచ్  కోరం సీతారాములు హాజరై ఈ క్రీడ పోటీలను ప్రారంభించారు. కోరం సీతారాములు  మాట్లాడుతూ.. లక్ష్మయ్య 30 సంవత్సరాలు అటెండర్ గా విధులు నిర్వర్తించారని, పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య గతంలో తక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు లక్ష్మయ్య సైతం  పాఠాలు  బోధించేవారని గుర్తు చేశారు. పాఠశాలకు లక్ష్మయ్య చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య కుటుంబ సభ్యులు గామాలపాటి నవీన్,  గామాలపాటి నరేష్, గామాలపాటి నగేష్, గామాలపాటి లక్ష్మీనారాయణ, గామాలపాటి సురేష్, గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.