విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బస
డీడీ జాదవ్ అంబాజీ
బెజ్జూర్,(విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బస చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ తెలిపారు.బెజ్జూర్ మండలంలోని సోమిని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్‌రూమ్, వసతి గదులు, భోజనశాలను పరిశీలించిన డీడీ.. ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, బెడ్‌షీట్లు అందజేశారు. పాఠశాలలో వర్కర్ల కొరత సమస్యను వారం రోజుల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఎన్‌ఎంకు సూచించారు.
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్న ప్రధానోపాధ్యాయుడు బిక్షమయ్యను డీడీ అభినందించారు. అనంతరం డీడీని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తిరుగు ప్రయాణంలో భారీ వర్షం కారణంగా సుస్మీర్, కుశ్నెపల్లి సమీపంలోని ఒర్రెలు ఉప్పొంగడంతో సుమారు గంటపాటు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీడీ గమనించారు. ఆయన వెంట ఎస్‌ఆర్‌పీ నందరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.






