ఆరుతడి పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరిపంటను సాగు చేయకుండా ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి,మండల ప్రత్యేక అధికారి జి శ్రీధర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలో రైతు దావుల లింగయ్య సాగు చేస్తున్న పెసర పంటను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సీజన్లో ఆరుతడి పంటలైన పెసళ్లు,జొన్నలు,బొబ్బర్లు,మినుములు,కందులు,ఆముదాల వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.విత్తనాలు కావలసిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు సహాయపడతారని అన్నారు.వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ,ఏఈఓ నేరెళ్ల సత్యం,సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్,పంచాయతీ కార్యదర్శి డి నవీన్ రెడ్డి,రైతులు దావుల లింగయ్య,సాయిని ఉప్పలయ్య,దావుల గోపాల్,నవీన్,బోయపల్లి వీరసోములు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






