నీట్ రద్దు చేసి విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి
ఇల్లందు,(విజయక్రాంతి): నీట్ పరీక్షను రద్దు చేసి, ఇంటర్మీడియట్ బైపీసీ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహారావు డిమాండ్ చేశారు. నీట్ విధానం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు కోచింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా నష్టపోతున్నారని అన్నారు.
ప్రజాస్వామ్య పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఏ ప్రభుత్వం నిలదొక్కుకోలేదని హెచ్చరించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని, యువత, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంతో పాటు, లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఆయన కోరారు. దేశ యువత, విద్యార్థుల విజయంగా ఈ పరిణామాన్ని అభివర్ణించారు.






