30 July, 2026 | 3:07 PM

వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు...

30-07-2026 02:11 PM

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్...

బాన్సువాడ, జూలై 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసిన సంఘటనల నేపథ్యంలో వేదికొక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. పురపాలక సంఘం దీనిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు చేపట్టింది.

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వీధి కుక్కలను గుర్తించి పట్టుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో జంతు సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.వీధి కుక్కలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు. కుక్కలు గుంపులుగా సంచరిస్తున్న ప్రాంతాలకు పిల్లలను వెళ్లనివ్వకండి. ఎక్కడైనా వీధి కుక్కల వల్ల ప్రమాదకర పరిస్థితులు కనిపించినట్లయితే వెంటనే పురపాలక సంఘానికి సమాచారం అందించండి.

పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో మరియు తిరిగి వచ్చే సమయంలో పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూడండి. ప్రజల సహకారంతోనే ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుంది. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పురపాలక సంఘానికి సహకరించాలని కోరుతున్నాము.