25 June, 2026 | 10:22 PM

ప్రారంభమైన ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నమోదు

25-06-2026 04:40 PM

గుండాల, (విజయక్రాంతి): అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి, అనర్హులను జాబితా నుండి తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం  చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని గురువారం తహసీల్దార్ సంగీత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..ఓటు ఉన్న ప్రతీ ఒక్కరూ బీఎల్వో లు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి, తిరిగి అందజేయాలని తెలిపారు. మండల పరిధిలోని కొన్ని గ్రామాలకు తహసీల్దార్ వెళ్లి ఫారాలు అందజేశారు.

ఈ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగుతుందని, బూత్ స్థాయి అధికారులు నెల రోజులపాటు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. ప్రతీ ఓటర్‌కు రెండు ఇన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, వివరాలు నింపి ఒక ఫారాన్ని అధికారులకు ఇచ్చి, మరొకటి తమ వద్ద భద్రపరచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రస్తుత ఓటర్లతో మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. సర్వేను నిర్లక్ష్యం చేస్తే ఓటు తొలగిపోయే అవకాశం ఉండటంతో పాటు భవిష్యత్తులో పలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దొంగ ఓటుకు అవకాశం ఉండదని ఆమె తెలిపారు.