6 August, 2026 | 2:49 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లపై ఎస్‌పీ క్షేత్రస్థాయి పరిశీలన

06-08-2026 01:42 AM

ప్రమాదకర కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశం 

నల్లగొండ క్రైం, ఆగస్టు 5 : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఎస్ హెచ్-02, ఎన్ హెచ్-167 రహదారులో ప్రమాదకర బ్లాక్ స్పాట్ల ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వెల్కమ్ టూ మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్డు, చిల్లాపురం, చింతపల్లి క్రాస్ రోడ్లు, జంకుతాడా రోడ్డు, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్డు ప్రాంతాలను పరిశీలించి , ప్రమాదాలకు గల కారణాలపై అధికారులతో సమీక్షించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ఓవర్టేకింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రోడ్ మార్కింగ్లు చెరిగిపోవడం, అక్రమ పార్కింగ్, వెలుతురు లేక పోవడం, అనధికారిక రోడ్డు ప్రవేశాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని ఎస్పీ గుర్తించారు.

ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్లు, రంబుల్ స్ట్రిప్స్, సీసీ కెమెరాలు, రిఫ్లెక్టివ్ బోర్డులు, బారికేడింగ్, క్యాట్ ఐస్* లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అక్రమ పార్కింగ్ తొలగించి, అన వసర జంక్షన్లు, ఓపెనింగ్స్ మూసివేయాలని, అవసరమైన చోట మాత్రమే నియంత్రిత యూ-టర్న్లు ఇవ్వాలని సూచించారు.

ప్రమాదకర కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, రద్దీ సమయాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అధిక ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయవద్దని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఎస్పి వెంట మిర్యాలగూడ ఇంచార్జ్ డి ఎస్ పీ రవి, సీఐ లు పీ .ఎన్ డి. ప్రసాద్, సోమనర్సయ్య, నాగభూషణ్, నాగరాజు, ఎస్ఐ లక్ష్మయ్య, రిటైర్డ్ సీఐ అంజయ్య, R&B, పంచాయతీరాజ్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.