1 September, 2026 | 12:27 AM

ఇరిగేషన్ కార్యాలయంలో పాముల భయం

31-08-2026 11:05 PM

శిథిలావస్థలో సింగరేణి క్వార్టర్లు.. పాములు, కోతులతో అధికారుల ఆందోళన

మరమ్మతులు చేపట్టి రక్షణ కల్పించాలని అధికారుల విజ్ఞప్తి

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండల కేంద్రంలోని ఇరిగేషన్ తహసీల్దార్ కార్యాలయంలో పాముల సంచారం అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సింగరేణి సంస్థ గతంలో నిర్మించిన పాత క్వార్టర్లలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో అధికారులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే కార్యాలయాల చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు క్వార్టర్లలోకి వస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న సింగరేణి క్వార్టర్లలో కార్యాలయ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని అధికారులు వాపోతున్నారు. వర్షం కురిసిన సమయంలో పైకప్పుల నుంచి నీరు కారి కార్యాలయాల్లోని ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులు తడిసిపోతున్నాయని తెలిపారు. ఒకవైపు పాముల సంచారం, మరోవైపు కోతుల బెడదతో విధులు నిర్వహించడమే సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామగిరి ప్రాంతంలో ఇరిగేషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు ఈ పాత సింగరేణి క్వార్టర్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కార్యాలయ భవనం చుట్టూ పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా విషసర్పాలు సంచరిస్తున్నాయని, ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత సింగరేణి అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కార్యాలయ సిబ్బంది భద్రతతో పాటు ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.