27 March, 2026 | 3:29 PM

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!

27-03-2026 01:51 PM

నాగర్ కర్నూల్/శ్రీశైలం,(విజయక్రాంతి): శ్రీరామ నవమి(Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీశైల క్షేత్రంలో శ్రీ సీతారామస్వామివారి కల్యాణ మహోత్సవం(Sitaramula kalyanam) ఘనంగా నిర్వహించారు. దేవస్థానం అనుబంధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని రామాలయంలో ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా సీతారాములవారికి, ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని వేదపండితులు లోకక్షేమార్థం సంకల్పం పఠించారు.  తరువాత మహాగణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, వరపూజ, గౌరీపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలతో సంప్రదాయబద్ధంగా సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అర్చకస్వాములు, వేదపండితులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.