27 March, 2026 | 5:05 PM

అంబరాన్నంటిన సీతారాముల కళ్యాణం

27-03-2026 03:11 PM

మోతె,(విజయక్రాంతి): మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా సాగిన వివాహ తంతు భక్తజనాన్ని పులకింపజేసింది. ఉదయం గణపతి పూజ, పుణ్యహ వచనం, కళ్యాణ మహోత్సవం అనంతరం ఓడి బియ్యం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.