calender_icon.png 15 February, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట బీఆర్‌ఎస్ పార్టీదే..

14-02-2026 12:00:00 AM

  1. హుస్నాబాద్ హస్తగతం 

హుస్నాబాదులో ఫలించని  బిజెపి ప్రయత్నం 

దుబ్బాకలో పనిచేయని హస్తం మంత్రం 

సిద్దిపేట, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి)/ గజ్వేల్ / చేర్యాల : మునిసిపల్ ఓట్ల లెక్కింపులో హస్తం మంత్రం హుస్నాబాద్ లో మాత్రమే పనిచేసింది. దుబ్బాకలో 4 వార్డులకు పరిమితం కాక హుస్నాబాద్ లో 16 వార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మున్సిపాలిటీ లో బిజెపి ఖాతా తెరవలేదు.

ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 16 కాంగ్రె స్, బిఆర్‌ఎస్ 14 గెలుపొందాయి. ఇక్కడ జనసేన, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలతోపాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలిచారు. అయినప్పటికీ కాంగ్రెస్ వన్‌సైడ్‌గా వార్డులను గెలు పొందడం మంత్రి పొన్నం  వ్యూహాలు పనిచేశాయని చర్చ జరుగుతుంది. 

దుబ్బాకలో..

దుబ్బాక నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండగా 20 వార్డులకు గాను 11 వార్డులు బిఆర్‌ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 4 వార్డులకు మాత్రమే పరిమితమైంది. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మెదక్ పార్లమెంటు సభ్యులుగా ఉన్న రఘునందన్ రావు చేసిన కృషి ఫలితంగా బీజేపీ 2 వార్డులను మాత్రమే గెలుపొందారు.

దుబ్బాకలో బిజెపి అధిక స్థానాలు గెలుచుకుంటుందని భారీగా ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి చేదు అనుభవం మిగిలిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రచారంలో అనేక లొసుగులు ఉన్నాయంటూ ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చిస్తున్నారు.

గజ్వేల్‌లో..

గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 11 బిఆర్‌ఎస్, 7 కాంగ్రెస్, 1 బిజెపి, 1 ఇండిపెండెంట్ చొప్పున గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోకపోవడంతో ఆ పార్టీలోనే అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇటీవల కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల నుంచి భారీ సంఖ్యలోనే బిజెపి పార్టీలో నాయకులు, కార్యకర్తలు చేరారు. అయిన ఆ పార్టీ ఒక స్థానానికి మాత్రమే పరిమితమైంది. గజ్వేల్ లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాజీ సీఎం కేసీఆర్ ప్రచారానికి రాకపోయినా ఆయన వ్యూహాలు ఫలించాలని ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. 

చేర్యాలలో..

చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను టిఆర్‌ఎస్ 7,  కాంగ్రెస్ 5 చొప్పున గెలుపొందాయి. రెండు పార్టీల మధ్య హోరా హోరీగా సాగిన ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీనీ కైవసం చేసు కుంది. జనగామ జిల్లా డిసిసి మాజీ అధ్యక్షులుగా కొనసాగుతున్న కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇదే మున్సిపాలిటీలో నివాసముంటారు. అయినప్పటికీ ఆయన మంత్రం పనిచేయలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.