24 March, 2026 | 4:15 PM

విద్యార్థులకు షీ టీమ్ అవగాహన

24-03-2026 03:09 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అబ్దుల్ కలాం పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ హసన్, షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్సై భిక్కలాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై భిక్కలాల్ మాట్లాడుతూ... విద్యార్థులు తమ భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

అలాగే మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రభావాలు, అధికంగా మొబైల్ ఉపయోగించడం వల్ల చదువుపై పడే ప్రభావం, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. కానిస్టేబుళ్లు స్వప్న, రజని, వరలక్ష్మి, దినేష్ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఆత్మరక్షణ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ బాలికలు ధైర్యంగా తమ సమస్యలను బయటపెట్టాలని, షీ టీమ్ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు.