28 May, 2026 | 4:52 PM

బక్రీద్ పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం విలువలను గుర్తు చేస్తుంది

28-05-2026 03:16 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన షబ్బీర్ అలీ

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ కు షబ్బీర్ అలీ మద్దతు

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ విశ్వాసం, త్యాగము, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆకాంక్షించారు. గురువారం కామారెడ్డి కోర్టు ఈదుగా వద్ద బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ ఈద్-ఉల్-అజ్హా పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని అన్నారు.

ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సౌభ్రాతృత్వం నిండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుల గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అన్నారు.  బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలపై ధ్వజం ఎత్తారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.కుల గణన, ఎస్.ఐ.ఆర్ (SIR) పై  దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, కుల గణన ప్రాధాన్యతపై వివరంగా మాట్లాడాతూ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన (సెన్సస్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కుల గణన అత్యంత కీలకం అన్నారు. దీనిపై స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి" అని ఆయన ఆదేశించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై షబ్బీర్ అలీ  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను అక్రమంగా తొలగిస్తూ దేశ మనుగడకే ప్రమాదం తెచ్చేలా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.రాష్ట్రాలపై ఒత్తిడి,బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి, 'SIR' పేరుతో లక్షలాది ప్రతిపక్ష ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారని మండిపడ్డారు.ఇందుకు బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాలే ఉదాహరణలు అని అన్నారు,పశ్చిమ బెంగాల్‌లో అధికారం దక్కించుకోవడం కోసం ఏకంగా 95 లక్షల ఓట్లను తొలగించారని, అలాగే బీహార్ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఓట్లను తొలగించి అక్రమంగా ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు.

ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండి, తమ వివరాలను అందిస్తూ ఓటు హక్కును తప్పకుండా నమోదు చేసుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.గంగా-జమునా తహజీబ్ వర్ధిల్లాలి – గోవుకు మద్దతు భారతదేశం ఎంతో కాలంగా 'గంగా-జమునా,తహజీబ్'  భిన్నత్వంలో ఏకత్వం అనే సాంప్రదాయంతో వర్ధిల్లుతోందని అన్నారు, మతతత్వ బీజేపీ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రేపి, సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. అలాగే, ఆవును దేశ జాతీయ జంతువుగా  ప్రకటించాలని, దేశ ముస్లిం  మత పెద్దలు కోరగా, మహమ్మద్ అలీ షబ్బీర్  దానికి సంపూర్ణ సమర్థన తెలుపుతూ మద్దతు ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ లౌకికత్వానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ, భారతీయులందరూ ఒకటే. కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడాలి" అని ఆకాంక్షించారు. పలువురు ముస్లిం పెద్దలు ఎస్పీ రాజేష్ చంద్ర, డీఎస్పీ మధుసూదన్, పట్టణ సిఐ నరహరి లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.