బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం
మండలిలో నల్ల చొక్కాతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నల్ల చొక్కాలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం నల్లా చొక్కా ధరించి మండలి సమావేశంలో పాల్గొని తన నిరసనను వ్యక్తం చేశారు.
బడ్జెట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేయకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మొండివైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో గొప్పగా చాటింపు వేసి ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. బడ్జెట్లో బీసీలకు హామీ ఇచ్చిన రూ.20,000 కోట్ల నిధులు కేటాయించకపోవడం, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
అలాగే రాబోయే ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి తీరుతామని హెచ్చరించారు. బీసీలకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయానికి తగిన బుద్ధి చెప్పేది ప్రజలే అని, ప్రతి ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో నిరసనలు ఉధృతంగా మారడంతో టీఆర్పీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.




