ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసిన సీనియర్ సిటిజన్స్
కూకట్ పల్లి,(విజయక్రాంతి): కేపిహెచ్ బి కాలనీ పార్క్ ను అభివృద్ధి చేయాలనీ మేడ్చల్ మల్కాజ్ గిరి ఎంపి ఈటెల రాజేందర్ నుఅయన కార్యాలయంలో శనివారం సినియర్ సిటిజెన్ కౌన్సిల్ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎంపి రాజేందర్ ను సీనియర్ సిటిజన్స్సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా పార్క్ ను అభివృద్ధి చేయాలనీ కోరారు. పార్క్ గ్రౌండ్ ఎత్తు పెంపు, ప్రహరీ గోడ ఎత్తు పెంపు, నాణ్యమైన బెంచీల ఏర్పాటు, తగినన్ని విద్యుత్ దీపాలు ఏర్పాటు, పూల మొక్కలు, నీడనిచ్చే చెట్ల పెంపకం, పార్క్ నిర్వహణ మెరుగుపరచడం వంటి అంశాలను ఎంపి దృష్టికి తీసుక వచ్చారు.
ఈ విషయం లో సానుకూలంగా స్పందించిన ఎంపి ఈటెల రాజేందర్ సంబంధిత అధికారులతో మాట్లాడి పార్కు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ వృద్ధులకు ప్రశాంతమైన వాతావరణంలో విహరించేలా పార్కులను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయడం అత్యంత అవసరమన్నారు.
కెపిహెచ్బి 6వ ఫేసులోని సీనియర్ సిటిజన్స్ పార్క్ లో నెలకొన్న సమస్యలను ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకు వెళ్లామని, వాటి పరిష్కారానికి ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ప్రీతం రెడ్డి, బిజెపి నాయకులు గురు ప్రసాద్,ఎం. కోటేశ్వరరావు, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సభ్యులు సుబ్బారాజు, శివ శంకర్ రెడ్డి, ప్రొఫెసర్ అప్పారావు, రామకృష్ణ, భానుమతి గాయత్రి, రమణారావు, జనార్దన్ రెడ్డి,కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






