ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకే అవకాశం
పరివాహక ప్రాంత ప్రజలకు పోలీసులకు హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎస్ ఐ. శ్రీకాంత్
గంభీరావుపేట,(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మానేరు వాగులో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిందని ఈ నేపథ్యంలో మానేరు డ్యాం ఈ రాత్రి పూర్తిస్థాయికి చేరుకుని మత్తడి దుంకే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీనితో మానేరు వాగు పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంభీరావుపేట ఎస్ ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, పశుపోషకులు తమ పశువులను, మేకలను మేత కోసం వాగు వైపు తీసుకెళ్లవద్దని సూచించారు.
వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, చిన్నపిల్లలను కూడా వాగుల దగ్గరకు వెళ్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్ ఐ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు






