8 August, 2026 | 9:59 PM

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఉద్యమిద్దాం

08-08-2026 08:41 PM

- టియుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  ఓరుగంటి ఆనంద్

బెజ్జంకి: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కాపాడేందుకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టియుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపునిచ్చారు. బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్‌లో బెజ్జంకి, గన్నేరువరం మండలాల ఉద్యమకారుల సమావేశం శనివారం నిర్వహించారు. టియుఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శానగొండ శరత్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు కుటుంబాలను, పనులను వదిలి ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం టి యు ఎఫ్ గత ఎనిమిదేళ్లుగా పోరాడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వెంటనే నివేదిక ఇచ్చి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల సాయం, రూ.25 వేల పెన్షన్, ఉచిత రవాణా, వైద్యం, పిల్లలకు ఉచిత విద్య, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యమకారుల హక్కుల సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ ఉద్యమకారుడు చింతకింది శ్రీనివాస్  ఆధ్వర్యంలో  నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో ఉద్యమకారులు నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.