1 June, 2026 | 2:07 AM

స్కూల్ ఫుడ్ టెండర్లు కఠినం!

01-06-2026 12:48 AM
  1. రూ.16 కోట్ల ఈఎండీ చెల్లిస్తేనే అవకాశం
  2. టెండరు సంస్థకు మూడేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్ తప్పనిసరి
  3. కొత్త రూల్స్‌తో చిన్న వ్యాపారుల గగ్గోలు
  4. రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
  5. పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి  

హైదరాబాద్, మే 3౧ (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లకు కిరాణా సరుకులు, క్లీనింగ్ సామ గ్రి సరఫరాకు ప్రభుత్వం నూతనంగా తీసుకువ చ్చిన మార్గదర్శకాలపై ఆయా వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టెండరు దాఖలుకు ప్రభుత్వం నిర్ణయించిన కఠిన నిబంధ నలపై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

బడా వ్యాపారులకే లబ్ధి చేకూర్చేలా కొత్త రూల్స్ ఉన్నాయంటూ, ప్రభుత్వం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  టెండర్ నోటిషికేషన్‌ను రద్దు చేయడంతో పాటు కొత్తగా జారీ చేసిన రూల్స్‌ను మార్చాలని  ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త రూల్స్‌ను సవాల్ చేస్తూ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కిరాణా వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఇవీ.. కొత్త రూల్స్

టెండరు నిబంధనలో భాగంగా రూ.16 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లించాలని, అలాగే  టెండరు దాఖలు చేసే సంస్థకు గడిచిన మూడు సంవత్సరాల్లో రూ.500 కోట్ల టర్నోవర్ ఉండాలనే షరతును విధించారని పిటిషన ర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అర్హతలు చిన్న, మధ్యతరహా వ్యాపారులకు సాధ్యం కాదని, ఫలితంగా బడా కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించేలా నిబంధనలున్నాయన్నది చిన్న వ్యాపారుల వాదన. 

ఇలాం టి షరతుల వల్ల వేలాది మంది చిన్నవ్యాపారులు టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోనున్నారు. వారిపై ఆధారపడిన ఉద్యోగులు, వారి కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్‌లో వివరించారు. ప్రభుత్వ కొనుగోలు విధానాన్ని కేంద్రీకరించడం ద్వారా మార్కెట్‌లో ఏకపక్ష ఆధిపత్యం ఏర్పడే ప్రమాదం ఉందని విన్నవించారు.

గతంలో జిల్లా స్థాయిలోనే టెండర్లు

పిటిషనర్ల వాదన ప్రకారం 2024--25, 2025--26లో జిల్లా కొనుగోలు కమిటీ (డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ)ల ద్వారా టెండర్లు నిర్వహించేవారు. టెండర్లలో పాల్గొని పోటీ ధరలకు సరుకులు సరఫరా చేసి ఎటువంటి ఫిర్యాదులకు తావు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. అయితే 2026--27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3,000కు పైగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లకు కిరాణా సరుకులు సరఫరా చేయడానికి కేవలం ఒకే ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొనడాన్ని పిటిషనర్లు వివరించారు.

గతంలో అమలులో ఉన్న జిల్లా స్థాయి టెండర్ విధానాన్నే కొనసాగించాలని వారు కోరారు. 2026 మే 22న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు దానిపై స్టే విధించాలని  హైకోర్టును పిటిషనర్లు అభ్యర్థించారు. చిన్న వ్యాపారుల భాగస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం కొత్త టెండర్ విధానాన్ని రూపొందించాలని కూడా వారు కోరారు.