స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉపయుక్తం!
తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో మండల స్థాయిలో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ), విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు విద్యార్థుల్లో అభ్యాసనను మెరుగుపరుస్తున్నాయి.
పాఠశాలలు ప్రారంభమయిన జూన్ నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు 9 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. విద్యార్థుల్లో చతుర ప్రక్రియలైన వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం నేర్పించడానికి అనుసరిస్తున్న విధానాలను స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల ద్వారా చేయడం గొప్ప విషయం. రాష్ర్టంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులందరికీ చదువడం, చదివింది అర్థం చేసుకోవడం ద్వారా సంపూర్ణ వికాసం పెంపొందించడానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉపయుక్తమవుతున్నాయి.
విద్యార్థులు అర్థం చేసుకున్న విషయాన్ని తమ నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా స్కూల్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను మెరుగు పరుచుకుంటున్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో అమలవుతున్న విధానాలను, మండలంలోని వేర్వేరు పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు అభ్యసన ఫలితాలు, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పుస్తకాల్లో సాధించిన సామర్థ్యాలను స్కూల్ కాంప్లెక్స్‌లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్‌లు అన్ని విషయాలను చర్చిస్తున్నారు.
స్కూల్ కాంప్లెక్స్‌లలో సమయాన్ని వృధా చేయకుండా రాబోయే నెలల్లో బోధించాల్సిన పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక రూపొందించుకోవడానికి స్కూల్ కాంప్లెక్స్‌లు దోహదపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ప్రభుత్వ, పంచాయతీ రాజ్ కలిసి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి తోడ్పాటు అందించాలి.
విజయ్‌భాస్కర్, కరీంనగర్




