ఆర్.టీ.సీ కార్మికులారా అధైర్యపడకండి
- సమ్మె రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు...
- ఆర్.టి.సి కార్మికుల న్యాయమైన సమ్మెకు మాజీ మంత్రి సంఘీభావం
వనపర్తి, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ) :ఆర్.టి.సి కార్మికులు చేస్తున్న మూడవరోజు సమ్మెకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ రూపకల్పన చేసింది నిజాం నవాబు అని అనాటి నుండి ఆర్.టి.సి కి వేల కోట్ల ఆస్తులు కలిగి ఆర్.టి.సి సంస్థ ఎదిగిందన్నారు. అటువంటి ఆర్.టి. సి సంస్థ కె.సి.ఆర్ హయాములో ఆర్.టి.సి కార్మికుల సంక్షేమం కోసం ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.
ఆర్.టి.సి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి చట్టాన్ని రూపొందించి గవర్నర్ అనుమతి కోసం పంపడం జరిగింది అని నాటి గవర్నర్ కాలయాపన వల్ల సాధ్యం కాలేదని ఆయన వివరించారు. వేతన సవరణ 44శాతం అందించింది కూడా కె.సి.ఆర్ అని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడడం మన ప్రాథమిక హక్కు అటువంటి ప్రాథమిక హక్కును కూడా నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగ తొక్కడాన్ని తీవ్రంగా ఖండించారన్నారు.
ఆర్.టి.సి కార్మికులు గతములో సమ్మె చేస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో సంస్థను విలీనం చేస్తామన్న రేవంత్ రెడ్డి మాట నిలుపుకొని వెంటనే ఆర్.టి.సి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, తదితరులు ఉన్నారు.






