చదువుతోపాటు నైపుణ్య అభివృద్ధి అవసరం
గద్వాల టౌన్ ఏప్రిల్ 24 : యువత తాము ఎంచుకున్న రంగంలో రాణించాలంటే చదువుతోపాటు ఆయా రంగాలపై నైపుణ్య అభివృద్ధి ఎంతో అవసరమని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో శుక్రవారం గద్వాల ఏటిసి (అడ్వానస్డ్ ట్రైనింగ్ సెంటర్) వద్ద విద్యావంతులైన నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధిపై ఇస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) నర్సింగరావు తో కలిసి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న వృత్తులు, వ్యవసాయం, తదితర పనులకు ఖాళీ సమయాల్లో సహకరిస్తే వారికి ఆయా రంగాలపై పట్టు రావడమే కాక సామాజిక పరిస్థితులపై అవగాహన కలుగుతుందన్నారు. ఏటిసిలో ఇస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత చదువుల అనంతరం విద్యార్థులు ఉద్యోగాలు వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, తద్వారా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చన్నారు.
ప్రభుత్వం యువతకు ఉపాధి చూపేందుకు కల్పిస్తున్న వివిధ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగడమే కాక మంచి పౌరులుగా పేరు తెచ్చుకోవాలని అదనపు కలెక్టర్లు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ బాషా, డీఈవో విజయలక్ష్మి, డిడబ్ల్యుఓ సునంద, ఉపాధి కల్పనాధికారి చరణ్ దీప్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్, డిఐఈఓ హృదయ రాజ్, ప్రత్యేక అధికారి నూకరాజు,ఏఎస్సిడిఓ నాగరాజు, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.






