24 July, 2026 | 11:07 AM

రాజకీయ ఉనికి కోసమే పుట్ట మధు ఆరాటం

24-07-2026 09:54 AM

మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబును దూషిస్తే ప్రజలు క్షమించరు 

 మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, జూలై 23(విజయ క్రాంతి): రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ విమర్శించారు. గురువారం మంథనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు విరుద్ధమని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులను దూషిస్తే ప్రజలు సహించరని, అలాంటి రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.

మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

పుట్ట మధు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమని, ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత వ్యక్తిగత విమర్శలతో రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం ఫలించదని కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రజల తీర్పే అంతిమమని, అభివృద్ధి, ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుపై అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలు కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.